పిల్లలు, కన్నె పిల్లలు-నగవుతో బాటు నగకూడా అందం!!
పిల్లలు, కన్నెపిల్లల అల్లరి అంతంత కాదు-పిల్లలల్లరి కన్న-కన్నెఅల్లరెక్కువే ఏంచేతనంటే కన్నెపిల్లలో “కన్నె”కలదు మరి పిల్లల్లో కన్నెలేదాయే గదా! కానీ ఏ కన్నెపిల్లా ఈ రోజుల్లో నగలే పెట్టట్లేదు...
కాదేదీ కవితకి అనర్హం అని శ్రీశ్రీ అన్నట్టు! “కాదే నగా అనర్హం ఆభరణంగా”! కన్యై పుట్టి “కన్యా రాశి” లో ఉంటే మాత్రం ఏం ప్రయోజనం,కాసుల ఆభరణాలు లేకుండా! అప్పట్లో కన్యా రాశి కన్నెపిల్లలే కాదు అన్ని రాసులవాళ్ళు- రాసులకొద్దీ కాకపోయినా- ఒంటి నిండా బంగారు ఆభరణాలు పెట్టుకునే వాళ్ళు-ఒక్క పెళ్ళిళ్ళప్పుడు మాత్రమే కాదు-ఈ మాదిరి కన్యారాసులు ఇప్పుడు కరువయ్యారే!
ఏమైనా అంటే బంగారం ధర స్వర్గానికి చేరువలో ఉంది, మనకెక్కడ అందుతుంది అనేవాళ్ళు వున్నారు, ఇది వాస్తవం కూడానూ అయినా సరే మిగిలిన దుబారా ఖర్చులు తగ్గిస్తే ఓ పిసరు బంగారం కొనుక్కోలేరా ఏమిటి-మాల్స్, సినిమా హాల్స్, వీకెండ్ పార్టీలు, స్పాలు కొద్దిగా తగ్గిస్తే, తిండి వీధుల్లో (ఈట్ స్త్రీట్స్) తిరగడాలు కాస్త తగ్గిస్తే చాలదూ!
ఈ కింద జాబితా ఎంతమంది ఆడపిల్లలకి తెలుసు ఈ రోజుల్లో, ఏదో బహు కొద్దిమందికి తప్ప!!!
ఏడు వారాల నగలు
చేతికి వంకీలు
పాపిడి బిళ్ళ
నడుముకు వడ్డాణం
చేతికి మూరెడు గాజులు
ముక్కుకు ముక్కెర
చెవులకు దుద్దులు
వేళ్ళకి ఉంగరాలు
కాలికి పట్టాలు
కాలికి మంజీరాలు
ముంజేటి మంజీరాలు
జడ కుచ్చులు
వేలికి మెట్టెలు
తలలో పువ్వులు
పెదాలపై నవ్వులు
సిగ్గూ,బిడియాలు
వయ్యారాలు-నయగారాలు
ఏవి-ఇవి అన్నీఏవి-ఇవన్నీధరించిన ఒక్కవనిత కనరాదేమి- కానరాదేమి!!! కనడానికి కాంతలున్నారు,వీక్షణకి నయనాలున్నాయి! అయ్యారే,మరి నిరీక్షణ తప్పదా- ఈలాటి వనితని కాంచుటకు!!! స్వప్నంలో కూడా "స్వప్న" దర్శనం ఇచ్చింది కూడా ఇవేవీ లేకుండానే-పొట్టి పొట్టి,చాలీచాలని దుస్తులతో,ఒక్క నగాలేకుండా,ఉత్తి నగవుతోనే- కలలోనే కాదు ఇలలో కూడా!ఆ నగవందానికి, ఒక “నగ” తోడైతే ఆ అందమే వేరు- వీటికి తోడు మొహాన ఓ బొట్టు-“చిరుదయినా” పర్వాలేదు- ఒక్కసారి ఇవి పెట్టుకొని మీకు మీరే చూసుకోండి అద్దంలో- అద్దం అబద్ధం చెప్పదుగా!
ఏమైపోయారు,కొత్తతరంతో వీరంతా తెరమరుగై పొయారా;వీరందర్ని సినిమాలలోనే చూడాలా?మిగతా రాసుల కన్యల సంగతి ఎలాఉన్నా,కనీసం కన్యారాశి కన్యలన్నా (పెళ్ళికిముందు అందరూ కన్యలూ-కుమారిలే కదా, అంచేత అందరు కన్యలూ అని) వేషధారణ,ఆభరణాలతో కనపడచ్చు కదా!
బిగుతు బట్టలూ,అవీ అరకొరగా; పై దుస్తులు వేసుకోవడం- లోదుస్తులు కనపడటం కోసమే అన్నట్టుగా వస్త్ర ధారణ.పైపెచ్చు మగో ఆడో తెలియని వస్త్రధారణ.
“స్త్రీ స్వతంత్రం” అనే ఒక నినాదంలో పడ్డట్టు ఉంది “కొంతమంది నారీమణులు” ఈ నారీలోకంలో,తాము స్త్రీలమే అనే సంగతే మరిచి.ఇదేదో మేల్ షేవనిజాం (Male chauvinism) అనుకోకండి!
పాతరోజులు వెనక్కి జరపడం సాధ్యంకాదు కానీ,కొత్తతరం వారు,పాతలోని కొత్తని గ్రహించి మెలుగుతే బాగుంటుంది,పాతపడరు-దీనివల్ల క్రొంగొత్తగానే ఉంటారు, కనిపిస్తారు కూడా!
ప్రస్తుత కరోనా పరిస్థితులవల్ల,అందరి స్థితిగతులు కొద్దిగా తారుమారు అయ్యాయి.కొత్త అలవాట్లు నేర్చుకున్నాం.కొత్తగా జీవించడం అలవాటు చేసుకున్నాం- కాంచలేని ఆ సూక్ష్మజీవికి సర్వదా కృతజ్ఞులం!
ఏదో మనసులో మాట చెప్పా-నా విన్నపాన్నికూడా ఒక చేవిలో వేసుకోండి,రెండో చెవులోంచి వదిలేయకుండా- ఆ రెండు చెవుల మధ్య బుర్ర ఉందిగా అందులోకి! మీరుమారినా మారకపోయినా మాతరం ప్రేమలూ,ఆప్యాయతలు మీమీద అలాగే ఉంటాయి,మీరు ఎలాగున్నా-మేము మాతరం కాబట్టి, మీ యువతరంలా కాదు!